హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని స్పీకర్ టీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై అంతే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాన్రాను సీఎం కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్టుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ అక్రమంగా సొమ్ము కూడబెట్టుకుంటున్న కేసీఆర్.. ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేసి పశువుల్లా కొంటున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడి కూడబెట్టుకున్న సొమ్మునంతా కక్కిస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ అవినీతిపై లోక్‌పాల్‌కు వెళ్తామని, కేసీఆర్‌ను అణగదొక్కే వరకు కాంగ్రెస్ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆట మొదలుపెట్టాడని, ఆ ఆటకు తామే ముగింపు పలుకుతామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించిన మల్లు భట్టివిక్రమార్క.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ దొంగతనంగా వినతిని తీసుకుని ఆమోదించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు కోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మరోవైపు సీఎల్పీని టీఆర్ఎస్‌లో ఎలా విలీనం చేస్తారని భట్టి నిలదీశారు.
సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు