జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కారు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2017లోనూ ఓసారి ఆయన కాన్వాయ్‌(Minister Errabelli Dayakar Rao`s convoy)లోని రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రోడ్డుపక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లాయి.

Last Updated : Nov 24, 2019, 05:30 PM IST
జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌(Minister Errabelli Dayakar Rao`s convoy)లోని బుల్లెట్ ప్రూఫ్ కారు శనివారం రాత్రి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం చీటూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ పార్థసారథి(30), మంత్రి ఎర్రబెల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమాదానికి గురైన కారులో కాకుండా మరొక కారులో ప్రయాణిస్తుండటంతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కారు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2017లోనూ ఓసారి ఆయన కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రోడ్డుపక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లాయి. 

Read also : మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి!

యాదృశ్చికంగా అప్పట్లోనూ ఇదే జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి నుంచి మాదాపురం వెళ్తుండగా మార్గం మధ్యలో చెరువు కట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు చెరువులో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తుగా అప్పుడు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అప్పుడు ప్రమాదానికి గురైన ఓ వాహనంలో ప్రయాణిస్తున్న గిరిజన సహకార సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ కొంతసేపు అస్వస్థతకు గురైనప్పటికీ.. తర్వాత తేరుకున్నారు. అలాగే ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ చేతికి స్వల్పంగా గాయలయ్యాయి.
  
ఆ తర్వాత మళ్లీ శనివారం రాత్రి జరిగిన ప్రమాదం కూడా దేవరుప్పుల మండలానికి పక్కనే ఉన్న లింగాలఘణపురం మండలం కావడంతో జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే రహదారి ఎందుకో దయన్నకు కలిసిరావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఆయన్ను ఆప్యాయంగా దయన్న అని పిలుచుకునే అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు.

Trending News