Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం కష్టమేనని.. అందుకే అక్కడి నుండి బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలు పలు ఆడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకే తాను బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నానని పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాంలో ఉన్న తన అనుచరులకు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే మరోవైపు ఈ ప్రచారం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలో ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే నిన్న జనగాంలో ముత్తిరెడ్డి అనుచరులతో రహస్యంగా ఓ సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రహస్య సమావేశంపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమోసాలు తిని చాయ్‌లు తాగే వాళ్లు కొందరు నిన్న హరితా ప్లాజాలో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నారు అని మండిపడిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. బయట మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తన వర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ నిన్నటి సమావేశానికి వెళ్లలేదన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు అంతా తనతోనే ఉన్నారన్న ముత్తిరెడ్డి.. నిన్న సమావేశం పెట్టుకున్న వాళ్ళ దగ్గరకు తాను వెళ్ళానని అన్నారు. రూమ్‌లో ఉండి లోపలి నుండి తలుపులు పెట్టుకున్నారు అని చెబుతూ అలా భయపడి బతకటం ఎందుకు అని సమావేశంలో పాల్గొన్న వాళ్లని ఎద్దేవా చేశారు. నిన్న హోటల్‌లో గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారు. వాళ్ళ దొంగ బతుకులను చూస్తే చాలా బాధనిపించింది అని వారి పట్ల సానుభూతి వ్యక్తంచేశారు.
కొంతమంది వ్యక్తులు జనగాంలో అభివృద్ధికి అడ్డం పడితే వారి పట్ల తాను కథినంగా వ్యవహరించానని చెబుతూ తాను కూడా గూండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్నే అని వ్యాఖ్యానించారు. గుండాగిరి చేసిన వారి పట్ల తానొక సింహా స్వప్నంలా మారాను. అది వారు జీర్ణించుకోలేకపోయారు. అందుకే తానంటే గిట్టని వాళ్లంతా కావాలనే తనపై ఇలా వివాదాలు సృష్టించారు తప్పితే అందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేశారు. ఈ కుట్రలు కుతంత్రాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలుసు అని స్పష్టంచేశారు. తాను కేసిఆర్‌కు సైనికుడినేనని.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
Muthireddy Yadagiri Reddy: గూండాలను కంట్రోల్ చేసిన గూండాగాన్నే.. ముత్తిరెడ్డి