తెలంగాణలో కొత్త పంచాయితీ చట్టం..?

   

Last Updated : Nov 12, 2017, 08:36 PM IST
 తెలంగాణలో కొత్త పంచాయితీ చట్టం..?

గ్రామ ప్రజా పరిపాలన మరింత సజావుగా సాగేందుకు అందరికీ ఆమోదయోగ్యమయ్యే కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.  పంచాయతీ వ్యవస్థను ప్రభావవంతంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు.  ఈ చట్టాన్ని ఎలా రూపొందించాలనే అంశం మీద ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు చెల్లప్ప, ఎంపీ వినోద్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌, కమిషనర్‌ నీతూప్రసాద్‌లతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘పంచాయితీ చట్టం తొలుత రూపొందించినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలు రావాలి. ఆనాడు గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులేమిటో చెబుతూ కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. అయితే తర్వాత దశకంలో అవే మార్గదర్శకాలు మారుతున్న స్థితిగతులను బట్టి మారే అవకాశముండాలి. ఒకప్పుడు మంచినీటి సరఫరా అనేది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరిగేది. ఇప్పుడు మిషన్‌ భగీరథ పథకం ద్వారా అదే పథకం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోంది. అంతే కాదు ఒకప్పుడు పంచాయితీ పరిధిలోకి వచ్చిన వైద్యం, రోడ్ల నిర్మాణం, చెరువుల తవ్వకం, బోరు పైపులు వేయడం లాంటి విషయాలన్ని పంచాయితీ పరిధి నుండి ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. అలాగే గతంలో పంచాయతీలకు ఉన్న ఆదాయ వనరులకు, ఇప్పుడున్న వనురులకు తేడా ఉంది. అందుకే ఇకపై గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులు ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. పంచాయతీలకు నిర్దిష్టమైన విధులు, నిధులను అప్పగించడంతో పాటు వారి అసలైన బాధ్యతలేమిటో కూడా నివేదిక ద్వారా తెలియజేయాలి’’ అన్నారు. 

 

Trending News