హైదరాబాద్: తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి. సత్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సర్వీసులకు వెళ్తున్న ప్రస్తుత కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం పి సత్యనారాయణ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో విధులు నిర్వహించే క్రమంలో డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి టాలీవుడ్ ప్రముఖులపై సైతం కేసులు నమోదు చేసిన సీరియస్ ఆఫీసర్‌గా అప్పట్లో అకున్ సభర్వాల్ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గానూ అవినీతిని అరికట్టేందుకు కృషిచేసిన అధికారిగా అకున్ సభర్వాల్ తనదైన మార్కు చూపించుకున్నారు. 17 నెలల పాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సేవలు అందించిన అకున్ సభర్వాల్‌కి ఆ శాఖ అధికారులు సైతం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సభర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్తున్న క్రమంలో ఆయన బాధ్యతలను విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన పి సత్యనారాయణ రెడ్డికి అప్పగించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ సత్యనారాయణ రెడ్డి పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులతో ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న మరో రెండు రోజుల్లో ప్రతీ విభాగంపై పూర్తిస్థాయిలో సమీక్ష చేపడతానని సత్యనారాయణ రెడ్డి తెలిపారు.