Revanth Reddy Speech From Munugode: దేశంలో కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తే.. రాష్ట్రంలో నన్ను అడ్డు తొలగించుకునేందు సీఎం కేసీఆర్ నాపై కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గోతికాడి నక్కల్లా ఎదురు చూశాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థనారాయణపురం మండలం సర్వేల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిపై, తెలంగాణ సర్కారుపై విరుచుకుపడుతూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.
నేను జైలుకెళ్లానని గర్వాంగా చెబుతున్నా
నన్ను అడ్డు తొలగించుకునే పథకాల్లో భాగంగా కేసీఆర్ నాపై 120 కేసులు పెట్టించాడని.. కానీ నేనేం దొంగతనం చేసి జైలుకు పోలేదని అన్నారు. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లాను కనుక.. ఔను, నేను జైలుకెళ్లానని గర్వాంగా చెబుతున్నా అని అన్నారు. పేదల కోసం పోరాడే క్రమంలో ఒక్కసారి కాదు.. 100 సార్లయినా జైలుకెళ్లడానికి రెడీగా ఉన్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదల కోసం కొట్లాడినందుకే కేసీఆర్ తనని కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించిన ఆయన.. నేను తిన్న చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తా అని కుండబద్ధలు కొట్టినట్టు ప్రకటించారు.
మునుగోడుకు.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న కనెక్షన్..
కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములనే గుంజుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గిరిజనులు అధికంగా నివాసం ఉన్న ఇక్కడి గ్రామాలకు సరైన రోడ్లు సైతం వేయలేని వారు.. ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి మాత్రం ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మునుగోడుతో తమ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుబంధం ఉంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత జైపాల్ రెడ్డి అమ్మమ్మ ఊరు ఇది అని గుర్తుచేసుకున్నారు.
కేసీఆర్ కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకున్నాడు..
గతంలో కమ్యూనిస్టులు ఎక్కడున్నారని కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏం చేయని వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రేవంత్ రెడ్డి హితవు పలికారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినందుకు మునుగోడులో బీజేపీకి ఓటేయలా ?లేక చంటి పిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ విధించినందుకు బీజేపీకి ఓటేయాలో చెప్పాలని బీజేపీ నేతలను నిలదీశారు.
ఒకప్పుడు నేను టీడీపీనే కావొచ్చు.. కానీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీరి ఓటు వేయాలని ఆయన మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన కాంగ్రెస్ పార్టీకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుందన్న ఆయన.. నేను కూడా మీలో ఒకన్నేనని అన్నారు. నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాగ్రెస్ పార్టీదని చెబుతూ.. పేదల నేస్తమైన కాంగ్రెస్ పార్టీనే గెలిపించండని ఓటర్లను వేడుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు. ఒకప్పుడు తాను టీడీపీలో ఉండి ఉండొచ్చు.. కానీ ఇప్పుడు నేను టీపీసీసీ చీఫ్‌ని. తనపై నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యత ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెడతా అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) శపథం చేశారు.
Also Read : YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ..వైఎస్ షర్మిల ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి