Revanth Reddy Karimnagar Speech: కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూశారో: రేవంత్ రెడ్డి

Revanth Reddy Karimnagar Speech: 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 

Written by - Pavan | Last Updated : Mar 10, 2023, 05:12 AM IST
Revanth Reddy Karimnagar Speech: కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూశారో: రేవంత్ రెడ్డి

Revanth Reddy Karimnagar Speech : " కేసీఆర్ పదే పదే తెలంగాణ మోడల్ అంటున్నారు.. తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా ? కేసీఆర్ వచ్చాక 3 వేల వైన్ షాపులు.. 60 వేల బెల్టు షాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా ? " అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రశ్నించారు. " కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూస్తే... పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్‌గఢ్ మోడల్ కావాలో మీరే ఆలోచించాలి. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి " అని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏం చేయాలో హితబోధ చేశారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 23వ రోజైన గురువారం కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మా నగర్ బైపాస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.

ఈ పాదయాత్ర అనంతరం అంబేద్కర్ స్టేడియంలో " కరీంనగర్ కవాతు " పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుంది. కరీంనగర్‌లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియం. వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో... కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే.. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. 

 

అయితే, సోనియా గాంధీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చారా ? ఈ వేదికపై నుంచి ప్రశ్నిస్తున్నా.. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం లాంటి కరీంనగర్‌కు ఏం చేశారు ? పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే..  తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగా రాష్ట్రం ఏర్పడింది. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేశారు ? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. పేద రైతులకు రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు నిరుపేదలకు అయ్యే వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం అంటూ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం గడ్డపై నుంచి రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు.

Trending News