హైదరాబాద్: ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందపై 6 నెలల నగర బహిష్కరణ విధించినట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ధర్మాగ్రహ యాత్రకు ఉపక్రమించిన స్వామి పరిపూర్ణానందను రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు నోటీసిచ్చి పోలీసులు గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోనికి ప్రవేశంచకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
ఆయనను హైదరాబాద్ పరిధి నుంచి తరలించిన పోలీసులు.. ఎక్కడకు తీసుకెళ్లారనేది బయటకు వెల్లడించలేదు. కాగా రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్‌ను రెండు రోజుల క్రితం బహిష్కరించారు. మహేష్ మాటలకు వ్యతిరేకంగా పరిపూర్ణానంద పిలుపునివ్వడంతో.. శాంతిభద్రతల సమస్య తలెత్తొచ్చని ఇలా చేశారని సమాచారం.
తనకు నగర బహిష్కరణ విధించడంపై అనుచరులు ఆందోళన చెందవద్దని స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ధర్మం, న్యాయం రెండు కళ్ళుగా భావిస్తున్నానని, ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందనే నమ్మకం ఉందన్నారు. కాగా రాష్ట్ర హిందూ సేన తరఫున గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని.. స్వామి న్యాయ సలహాదారు పదారావు తెలిపారు. అప్పుడు నోటీసిస్తే తీసుకోలేదని అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు.