Telangana Elections: అసెంబ్లీపైనే విపక్ష పార్టీల ఎంపీల గురి! ముఖ్యమంత్రి రేసు కోసమేనా?

Telangana Elections: తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీల్లోని సీనియర్ నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు, ఇక్కడే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి

Written by - Srisailam | Last Updated : Jul 25, 2022, 12:41 PM IST
  • అసెంబ్లీ వైపు బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ల గురి
  • అసెంబ్లీకి పోటీ చేస్తామంటున్న ఎంపీలు
  • ముఖ్యమంత్రి రేసు కోసమేనా?
Telangana Elections: అసెంబ్లీపైనే విపక్ష పార్టీల ఎంపీల గురి! ముఖ్యమంత్రి రేసు కోసమేనా?

Telangana Elections:  తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. వలసల చుట్టే రాజకీయం తిరుగుతోంది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీల్లోని సీనియర్ నేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు, ఇక్కడే ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపుగా ఎంపీలంతా అదే దారిలో ఉన్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండటానికే విపక్షాల ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారనే టాక్ వస్తోంది.

కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాళ్లు ముగ్గురు సీనియర్లే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి వరకు ప్రయత్నించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉండే నేతలే. అందుకే ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. నిజానికి వీళ్లు ముగ్గురు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారే. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ అసెంబ్లీకి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు ఉత్తమ్. ఆ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తాను నల్గొండ అసెంబ్లీ నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఆయన కూడా తన ఎంపీ పరిధిలో కాకుండా నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నారు. అయితే కొడంగల్ నుంచి పోటీ చేస్తారా లేక మరో సీటు నుంచా అన్నది తేలడం లేదు. హైదరాబాద్ శివారులోని ఏదైనా  ఒక నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రం కొడంగల్ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు,

కాంగ్రెస్ ఎంపీలంతా అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయం కాగా... బీజేపీ ఎంపీలది అదే పరిస్థితి ఉంది. బీజేపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు. ఆ నలుగురు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.గతంలో ఆయన అంబర్ పేట అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి అంబర్ పేట నుంచి అసెంబ్లీకి పోటే చేస్తారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ గెలిస్తే సీఎం రేసులో కిషన్ రెడ్డి కూడా ఉంటారని.. అందుకే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. గతంలో ఆయన కరీంనగర్ అసెంబ్లీ నుంచి పలుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో సంజయ్ అసెంబ్లీ పోటీ చేయడం ఖాయంగా చెబుతున్నారు. కరీంనగర్ లేదా వేములవాడ నుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి బండి సంజయ్ పోటీ చేయాలనే ప్లాన్ లో ఉన్నారనే చర్చ కూడా సాగుతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో సంజయ్ ముందుంటారనే టాక్ నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. అర్వింద్ కూడా వచ్చే ఎన్నికల్లో ఆర్మూరు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కూడా ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉండాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సోయం సీఎం రేసులో లేకున్నా ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఖాయమంటున్నారు.

మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలంతా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉండటానికే సీనియర్లంతా అసెంబ్లీపై గురి పెట్టారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవస

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News