Revanth Reddy on CM KCR: డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్...

Revanth Reddy on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 09:08 PM IST
  • తాజ్ డెక్కన్‌లో సీఎల్పీ భేటీ
  • కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న రేవంత్
  • డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్
  • రాష్ట్రంలో బీహార్ అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ
Revanth Reddy on CM KCR: డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు.. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్...

Revanth Reddy on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి బడ్జెట్‌ అని.. మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో సీఎల్పీ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారని... ఆ సుపారీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల భూకబ్జాలు పెరిగిపోయాయని.. ధరణి పోర్టల్‌లో లోపాలు హత్యలకు దారితీస్తున్నాయని అన్నారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఐదు మంది బీహారీ అధికారుల వద్దే 40 శాఖలు ఉన్నాయని అన్నారు. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేశ్ కుమార్, అంజనీ కుమార్‌లను తెలంగాణలో పెట్టుకుని కీలక శాఖలు అప్పగించారని అన్నారు. అందుకు వారు కేసీఆర్‌కు కృతజ్ఞతగా.. పరిపాలను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని ఆరోపించారు.

పరిపాలనలో కలెక్టర్, ఎస్పీలుగా అర్హతలేని వారిని నియమించి.. కేసీఆర్ వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ పథకాలు ఇంకెక్కడైనా ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారని.. ఛత్తీస్‌గఢ్‌లో ఇక్కడి కన్నా మంచి పథకాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ వరికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1960 ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో రూ.2500 ఉందన్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకం లేదని.. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం ద్వారా ప్రధాని మోదీకి తాము వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ అన్నారు. గవర్నర్ ప్రసంగం జరిగితే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే అవకాశం ఉండటంతోనే ఆ ప్రసంగం లేకుండా చేశారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు 55 రోజులు, బడ్జెట్ సమావేశాలు 30 రోజులు జరిగేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కేవలం 8 రోజులకే కుదించారని అన్నారు. ఈసారి సమావేశాలు 21 రోజులు జరిగేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సభలో కాంగ్రెస్‌కు ఏమాత్రం అవమానం జరిగినా రాష్ట్రం నలుమూలలా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని అన్నారు.

Also Read: Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ... బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్...

Also Read: లాయర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల దాడి..? ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News