Vijay Darda Meets CM KCR: తెలంగాణ సీఎంఓలో పొరపాటు.. నాలుక కర్చుకున్న అధికారులు.. అప్పటికే పబ్లిక్‌లోకి న్యూస్

Vijay Darda Meets CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గురువారం మీడియాకు విడుదల చేసే ఒక ప్రకటన విషయంలో పొరపాటు దొర్లింది. అయితే, మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అనంతరం పొరపాటు దొర్లిందనే విషయాన్ని గ్రహించి నాలుక కర్చుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు.. తర్వాత తమ పొరపాటును సవరించుకున్నారు. 

Written by - Pavan | Last Updated : Sep 30, 2022, 04:06 AM IST
  • మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేయడంలో పొరపడిన సీఎంఓ
  • పొరపాటును సవరించుకుంటూ మరో ప్రకటన విడుదల
  • అప్పటికే వార్తల్లోకెక్కిన మొదటి ప్రకటన
  • ఇంతకీ ఏంటా ప్రకటన.. అసలేం జరిగింది..
Vijay Darda Meets CM KCR: తెలంగాణ సీఎంఓలో పొరపాటు.. నాలుక కర్చుకున్న అధికారులు.. అప్పటికే పబ్లిక్‌లోకి న్యూస్

Vijay Darda Meets CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గురువారం మీడియాకు విడుదల చేసే ఒక ప్రకటన విషయంలో పొరపాటు దొర్లింది. అయితే, మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అనంతరం పొరపాటు దొర్లిందనే విషయాన్ని గ్రహించి నాలుక కర్చుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు.. తమ పొరపాటును వివరిస్తూ పాత ప్రకటనను సవరించాల్సిందిగా కోరుతూ మరో ప్రకటన విడుదల చేశారు. 

ఇంతకీ జరిగిన పొరపాటు ఏంటంటే..
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్ అయిన విజయ్ దర్డా గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన రింగ్ సైడ్ అనే పుస్తకాన్ని ఆయన సీఎం కేసీఆర్‌కి బహుకరించారు. అంతకుమించి ఆయన మరే ఇతర స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ భేటీ సీఎం కేసీఆర్, విజయ దర్దాల మధ్య మర్యాదపూర్వకంగా జరిగిన వ్యక్తిగత భేటీ మాత్రమే. 

ఇదిలావుంటే, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన దళిత నేత రాఘవేంద్ర కుమార్ కూడా గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశ రాజకీయాలు, దేశం తలెత్తి చూసేలా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం అని రాఘవేంద్ర కుమార్ కొనియాడినట్టుగా తెలిసింది. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడిన ఆయన.. కేంద్రంలోని బిజెపి అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు వెనుకబడిపోతున్నాయని, దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఒక ప్రత్యామ్న్యాయ నాయకత్వం దేశానికి తక్షణమే అవసరం అని రాఘవేంద్ర కుమార్ అభిప్రాయపడినట్టు సమాచారం.

కేసీఆర్ శాంతియుత పంథాలో ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తీరు ఎంతో గొప్పదని.. అయితే ఆ ఉద్యమ పంథా కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ప్రజల గుణాత్మాక అభివృద్ధికి దోహదపడాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ లాంటి నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని రాఘవేంద్ర కుమార్ కోరినట్టు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. కేసీఆర్ గురించి రాఘవేంద్ర కుమార్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలను మీడియాకు విడుదల చేయడంలోనే తెలంగాణ సీఎంఓ అధికార వర్గాలు పొరపడ్డాయి. రాఘవేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలను లోక్ మత్ మీడియా సంస్థల అధినేత విజయ్ దర్దా చేసిన వ్యాఖ్యలుగా మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ఆ తర్వాతే జరిగిన పొరపాటు గ్రహించిన సీఎంఓ.. లోక్ మత్ పత్రిక చైర్మన్ విజయ్ దర్ద పేరిట వచ్చిన ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ మరో ప్రకటన విడుదల చేసింది. తొలుత ఇచ్చిన మీడియా స్టేట్మెంట్ విజయ్ దర్డ ఇచ్చింది కాదని... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దళిత నాయకుడు రాఘవేంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యలను పొరపాటున విజయ్ దర్డా పేరిట వచ్చాయని జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) కలిసిన విజయ్ దర్ద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చుకుని మరో పొరపాటు దొర్లకుండా జాగ్రత్తపడ్డాయి. కాకపోతే అప్పటికే సీఎంఓ నుండి వచ్చిన మొదటి స్టేట్మెంట్‌‌ను కొన్ని మీడియా సంస్థలు వార్తల్లోకెక్కించి, రెండో స్టేట్మెంట్‌ని విస్మరించడం కొసమెరుపు.

Also Read : CM KCR Yadadri visit: సీఎం కేసిఆర్ యాదాద్రి, వరంగల్ పర్యటనల షెడ్యూల్

Also Read : Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు..వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News