తెలుగు మహాసభలపై టీసర్కారు సమీక్ష

    

Last Updated : Oct 20, 2017, 02:24 PM IST
తెలుగు మహాసభలపై టీసర్కారు సమీక్ష

తెలంగాణలో డిసెంబరు 15 నుండి 19 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు భారీస్థాయిలోనే ఉన్నాయి. ఈ ఏర్పాట్లను సమీక్షించడం కోసం ఒక కోర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించనుంది. దాదాపు 15 కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే జానపద కళారూపాలకు ఈ సభల్లో పెద్దపీట వేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా ఈ వేడులకకు ఆహ్వానించనున్నారు. ప్రవాసం నుండి కూడా తెలుగు ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా నుండి కూడా ప్రముఖ తెలుగువ్యక్తులు ఈ సభలకు హాజరవుతారని వినికిడి. 

తెలుగు మహాసభల్లో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, శిల్పకళావేదిక, ఎల్బీ స్టేడియం, హరిహరకళాభవన్ వంటి వేదికలన్నిటిపైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాహిత్య అకాడమి పురస్కారాలు పొందిన తెలుగు రచయితలతో సాహితీ గోష్టికి కూడా ప్రణాళిక రచించనున్నారు.

ఇక కోర్ కమిటీకి సారధ్యం వహించే బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి తీసుకోనున్నారు. అలాగే  ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,  తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మొదలైన వారు కోర్ కమిటీలో ముఖ్య సభ్యులుగా ఉండి సభలను ముందుకు నడిపిస్తారని సమాచారం. 

ఇప్పటికే తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో రూపుదిద్దుకుంటుంది. అలాగే తెలంగాణ రచయితల జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను కూడా ఈ సభల్లో విడుదల చేస్తున్నారని సమాచారం. 

Trending News