సెక్యూరిటీ లేకుండా మెట్రోలో గవర్నర్ సతీమణితో ప్రయాణం

ఏపీ, తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ రోజు తన సతీమణితో కలిసి హైదరాబాద్ మెట్రో రైలులో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రయాణించారు.

Last Updated : Jul 16, 2018, 09:22 PM IST
సెక్యూరిటీ లేకుండా మెట్రోలో గవర్నర్ సతీమణితో ప్రయాణం

ఏపీ, తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ రోజు తన సతీమణితో కలిసి హైదరాబాద్ మెట్రో రైలులో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడి మాదిరిగానే టికెట్టు తీసుకొని బేగంపేట నుండి అమీర్‌పేట వరకు ప్రయాణించారు. అక్కడ మళ్లీ ట్రైన్ మారి మియాపూర్ వరకు ప్రయాణించారు.

ఆకస్మాత్తుగా గవర్నర్ మెట్రోలో ప్రయాణించాలని భావించగా.. తత్తరపాటుకి గురైన మెట్రో రైల్ స్టాఫ్ వెంటనే హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఎన్వీఎస్ రెడ్డి మియాపూర్ స్టేషనుకి వచ్చి గవర్నరు దంపతులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత గవర్నర్‌ని ఎండీ స్టేషను లోపలికి ఆహ్వానించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఎండీ పబ్లిక్ ఏరియాలో ప్రయాణికుల కోసం చేసిన సౌకర్యాలను ఒకసారి వచ్చి సమీక్షించాలని కోరగా.. గవర్నర్ అందుకు అంగీకరించారు. 

మియాపూర్‌లో మెట్రో సిబ్బంది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల గవర్నర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో హైదరాబాద్ మెట్రోని తీర్చిదిద్దినందుకు ఎల్ అండ్ టీ యాజమాన్యాన్ని, హెచ్‌ఎంఆర్‌ఎల్ సిబ్బందిని ప్రశంసించారు. మాస్కో మెట్రో మాదిరిగా కొన్ని మెట్రో స్టేషన్లలో ఆర్ట్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన ఎండీకి సూచించారు.

అదే విధంగా, ప్రతీ మెట్రో స్టేషనులో ప్రయాణికుల అవసరార్థం మెడికల్ షాపులు, ఆహార షాపులు తప్పనిసరిగా ఉండేలా చూస్తే బాగుంటుందని కూడా తెలిపారు. తాము ఊహించని విధంగా గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణం చేయడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. గవర్నర్ పలువురు ప్రయాణికులను కూడా అడిగి మెట్రోలో సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు.

Trending News