తెలంగాణ రెవిన్యూ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కలిగే లబ్ధి ఏంటనేది ఈ భూరికార్డుల ప్రక్షాళన తెలిసేలా చేసింది: సీఎం కేసీఆర్

Last Updated : Feb 24, 2018, 08:50 PM IST
తెలంగాణ రెవిన్యూ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగులకు సర్కార్ ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూలవేతనాన్ని అదనంగా అందించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రెవిన్యూ శాఖలో 35,749 మంది ఉద్యోగులు ఒక నెల మూత వేతనాన్ని అదనంగా పొందనున్నారు. ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్న విధంగానే కేవలం 100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రెవిన్యూ సిబ్బందిని అభినందించారు. 

గడిచిన 80 ఏళ్లుగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల నిర్వహణ చేపట్టకపోవడంతో పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారైంది. మార్పులను నమోదు చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఆ నిర్లక్ష్యం కారణంగా భూరికార్డుల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పంట పెట్టుబడి పథకం అమలు కోసం.. భూ యజమానులు ఎవరో తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని సీఎం కేసీఆర్ తెలిపారు. 

ఈ భూరికార్డుల ప్రక్షాళన తర్వాత 20 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై ఒక స్పష్టత వచ్చింది. వివాదాల్లో ఉన్నవి మినహా మిగిలిన భూముల ప్రక్షాళన పూర్తైంది. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది ఈ భూరికార్డుల ప్రక్షాళన చూస్తే అర్థం అవుతుంది అని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

Trending News