మే 10 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతష్టాత్మకంగా చేపట్టిన 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది.

Last Updated : May 1, 2018, 01:04 PM IST
మే 10 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది. మే 10 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'రైతుబంధు' చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి పోచారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. యాసంగి కోసం నవంబర్‌ 18 నుంచి రైతు బంధు చెక్కుల పంపిణీ ఉంటుందన్నారు. మొత్తం రూ.1.50 కోట్ల ఎకరాలకు వానాకాలం, యాసంగిలో అందరికీ అందజేస్తామన్నారు.

తెలంగాణలోని ప్రతిడివిజన్‌లో 100 పడకల మదర్ కేర్ చైల్డ్ ఆసుపత్రులను(ఎంసీహెచ్) ప్రభుత్వం నిర్మిస్తుందని పోచారం తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఎంసీహెచ్‌లను నిర్మిస్తున్నామని, వీటిని 9 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. అటు వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని నల్గొండలో మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.  రైతుబంధు పథకం కింద రైతులకు ఇవ్వడానికి రూ.1,602 కోట్లను వ్యవసాయ శాఖ సోమవారం బ్యాంకుల్లో జమ చేసింది.

ఇదిలా ఉండగా.. ‘రైతుబంధు’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీఎంకే నేత స్టాలిన్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించినట్లు సీఎం కేసీఆర్‌ రెండు రోజుల చెన్నై పర్యటనలో ఉన్నప్పుడు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన కొద్ది కాలంలోనే తెలంగాణలో సాధించిన పురోగతి, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సరికొత్త పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

Trending News