తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. అక్కడే రెండు రోజులపాటు ఉండి జాతీయ స్థాయి నేతలను కలిసొచ్చారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం ఆంధ్రాను పట్టించుకోవడం లేదని అక్కడి నుంచే తన వాయిస్‌ని మీడియాకు వినిపించి తిరిగొచ్చారు. చంద్రబాబు అలా తిరిగిరాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన చేపట్టడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయా ? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సైతం రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తారనే వార్తలు వెలువడుతున్నప్పటికీ.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తమ అధినేత కంటి, పంటి పరీక్షల కోసమే ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నాయి. బహుశా టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నట్టుగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సి రావడమనేది తన ముందస్తు ప్రణాళికల్లో ఓ భాగమే అయ్యుండవచ్చేమో కానీ.. ఇలా చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే ఆయవ ఢిల్లీ పర్యటన చేపట్టడం మాత్రం రాజకీయవర్గాల్లో ఒకింత ప్రాధాన్యతను సంతరించుకుంది.