హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన విందు కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి భోజనం వడ్డిస్తున్న వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. అందరికీ చికెన్ వడ్డిస్తూ... తనకు ఎందుకు వడ్డించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వారిరువురి మధ్యన మాటామాటా పెరిగి.. అది పెద్ద గొడవగా మారి ఘర్షణకు దారితీసింది.
వెంటనే ఇరువురూ తమ తమ గ్రూపులకి ఫోన్ చేసి రప్పించారు. ఆ తర్వాత ఆ రెండు గ్రూపుల్లోని వ్యక్తులు బరిలోకి దిగి వేడుక ప్రాంగణంలో కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ కొట్లాటలో ఇద్దరు వ్యక్తులను ఎవరో కత్తులతో గాయపరచడంతో వారికి తీవ్ర రక్తస్రావమైంది. ఎప్పుడైతే వేడుకలో రక్తపాతం జరిగిందో గ్రూపుల్లోని వ్యక్తులందరూ పారిపోవడం మొదలెట్టారు. గాయపడిన వ్యక్తులను వారి వారి స్నేహితులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించాడు
ఎప్పుడైతే ఆసుపత్రిలో సంబంధిత వ్యక్తి మరణించాడో.. పాతబస్తీలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి.. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. హుస్సేనీ ఆలం ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ కేసులో భాగంగా కొట్లాటలో పాల్గొన్న రెండు గ్రూపుల మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీపీ అంజయ్య మీడియాతో తెలిపారు.