Rajyasabha Election: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు స్థానాలకు ఎన్నిక జరగనుండటంతో ఆశావహులు సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. బండా ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు ఇప్పటికే నామినేషన్లు కొనసాగుతున్నాయి. ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మికాంత రావు పదవి కాలం జూన్ 21తో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలు అధికార గులాబీ పార్టీకే దక్కనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు టీఆర్ఎస్ నేతలు ఆరాటపడుతున్నారు. కేసీఆర్ , కేటీఆర్ ప్రసన్నం కోసం పాట్లు పడుతున్నారు.
టీఆర్ఎస్ లో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన నాయకులు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన లీడర్లు.. ఇలా దాదాపు డజన్ మంది రాజ్యసభ సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇందులో కేసీఆర్ ఎవరికి టిక్ పెడుతారన్నది ఆసక్తిగా మారింది. రాజ్యసభ రేసులో ఉన్న నేతల్లో ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఖాయమని తెలుస్తోంది. ఇటీవలే పొంగులేటికి సీఎం కేసీఆర్ నుంచి సిగ్నల్స్ వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. కాని పొంగులేటి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సీతారాంనాయక్ కూడా తనకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. బీసీ కోటాలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. నర్సయ్య గౌడ్ విషయంలో కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని ఆతని అనుచరులు చెబుతున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు యోచనలో ఉన్న కేసీఆర్.. ఢిల్లీ రాజకీయాలను కో ఆర్డీనేషన్ చేసే నేతను రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు. ఈ కోటాలో కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరు వినిపిస్తోంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను పెద్దల సభకు కేసీఆర్ పంపిస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల పలు రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్.. తనతో పాటు ప్రకాష్ రాజ్ ను తీసుకెళ్లారు. దీంతో ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపి.. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారనే టాక్ కొన్ని వర్గాల నుంచి వస్తోంది.
ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కారు మోత్కుపల్లి. ఆ సమయంలోనే అతనికి కేసీఆర్ ఎంపీ సీటుపై హామీ ఇచ్చారని చెబుతున్నారు. మూడు సీట్లలో ఒకటి దళిత సామాజిక వర్గానికి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తే.. నర్సింహులుకు ఖాయమైనట్టేననే తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. కేసీఆర్ కు నమ్మకస్తులుగా ఉన్న వ్యాపారవేత్తలు సీఎల్ రాజం, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేర్లు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా వెళుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలో దగ్గరలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎవరికైనా ఛాన్స్ రావొచ్చంటున్నారు.
READ ALSO: AP Rajyasabha Election: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ ట్విస్ట్.. కొత్త ముఖాలకు ఛాన్స్?
READ ALSO: Karate Kalyani slaps Srikanth Reddy : యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి చెంప చెళ్లుమనిపించిన కరాటే కల్యాణి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook