వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాల జాతర

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.

Last Updated : Jul 29, 2018, 02:30 PM IST
వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాల జాతర

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుండే భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని హారతి ఇచ్చి తొలిబోనంను సమర్పించారు. బోనాలకు భారీ ఏర్పాట్లు చేశామని.. భక్తులు సహకరించాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత కూడా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఆమె మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున బంగారు బోనం సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు కూడా సతీసమేతంగా ఆలయానికి రానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు.

కాగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. వీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు గుడికి వచ్చే అవకాశాలు ఉండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ అంశాలు విధించారు. 3 వేల మంది సిబ్బంది సహాయంతో, అడుగడుగునా సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాగా జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం సోమవారం వైభవంగా జరగనుంది.

Trending News