Khyber Pakhtunkhwa Blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఇస్లామిక్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరుగుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 35 మంది చనిపోగా... మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జియో న్యూస్ కథనం ప్రకారం ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్‌లో ఆదివారం జమియత్ ఉలెమా - ఏ - ఇస్లాం ఫజి పార్టీ కార్యకర్తలు సమ్మేళనం జరుగుతుండగా ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో 35 మంది చనిపోయినట్టు పీటీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. గాయపడిన వారి సంఖ్య 50 కి పైగానే ఉందని.. అందులో ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని జియా ఇంగ్లీష్ కథనం పేర్కొంది. బాంబు పేలుడులో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు. పాకిస్థాన్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
పేలుడు జరిగిన ఘటనా స్థలంలో క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు 5 అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి అని రెస్క్యూ టీమ్ అధికార ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు.