మాస్కో: 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానాన్ని కూల్చేయమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆదేశించారు. వేల మంది ప్రజలను రక్షించడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. 2014లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. 2014లో రష్యాలోని సోచీలో శీతాకాల ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను చూసేందుకు స్టేడియానికి 40వేల మంది ప్రేక్షకులు వచ్చారు. ఇంకొద్ది గంటల్లో ప్రారంభ వేడుకలు మొదలవుతాయనగా పుతిన్‌కు భద్రతా అధికారుల నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ‘ఉక్రెయిన్ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్తున్న ఓ విమానంలో ఉగ్రవాదులు ఉన్నారు. వారు విమానాన్ని రష్యాలోని సోచీలో ల్యాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విమానంలోని ఓ ప్రయాణికుడి వద్ద బాంబు కూడా ఉన్నట్లు పైలెట్లు చెప్పారు’ అని పుతిన్‌కు సెక్యూరిటీ అధికారులు చెప్పారు.
స్టేడియంలోని ప్రజలు, విమానంలోని ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని వెంటనే పుతిన్ భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విమానాన్ని కూల్చివేయడమే మంచిదని భద్రతా సిబ్బంది పుతిన్‌కు చెప్పడంతో ఆయన అంగీకరించారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత పుతిన్‌కు మరో కాల్ వచ్చింది. ‘అది నకిలీ బెదిరింపు మాత్రమే. ఓ ప్రయాణికుడు తాగేసి విమానంలో హాల్ చల్ సృష్టించాడు. ప్రస్తుతం విమానం టర్కీకి వెళ్తోంది’ అని భద్రతా సిబ్బంది చెప్పారు. దీంతో పుతిన్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
‘పుతిన్’ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీలో రష్యా అధ్యక్షుడు ఈ సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రజల భద్రత కోసం ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడిని పలువురు నెటిజన్లు కొనియాడారు.