జపాన్ ప్రధాని షింజో అబే మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. ఆదివారం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార కూటమి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని, దిగువసభలో తమ ప్రాబల్యం ద్వారా ఆయన తప్పకుండా గెలుస్తాడని కొన్ని వార్తలు జపాన్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
షింజో అబే పనితీరుపై జపాన్ ప్రజలు కొంతవరకు విముఖత కలిగి ఉన్నా, ప్రస్తుత ఉత్తర కొరియా, అమెరికా మధ్య రగులుతున్న న్యూక్లియర్ ప్రయోగాల చిచ్చు జపాన్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అందుకే, ఇలాంటి విషయాల్లో ఎనలేని అనుభవం ఉన్న నాయకుడిగా షింజో అబేకి ఉన్న గుర్తింపును బట్టి ఆయన విజయం తథ్యమేనని పలువురు రాజకీయ నిపుణుల అభిప్రాయం. షింజో అబే అధికారిక పార్టీయైనా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఇప్పటికే మరికొన్ని పార్టీలతో జతకలిసి కూటమిగా పోటీలోకి దిగుతోంది.
టోక్యో గవర్నర్ యూరికో కోకే సారథ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ (పార్టీ ఆఫ్ హోప్) మరో పక్క బలహీనంగా ఉండడం కూడా షింజో అబేకి బలాన్ని చేకూరుస్తుంది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
1180 మంది అభ్యర్థులు దిగువసభలో 465 సీట్ల కోసం ఈ ఎన్నికలలో పోటీ పడనున్నారు.