ఎంసెట్‌లో మెరిసిన ఆణిముత్యాల మనోగతం‌

ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఏపీ ఎంసెట్‌లో విద్యార్థులు ర్యాంకులతో మెరిశారు.

Last Updated : May 3, 2018, 02:07 PM IST
ఎంసెట్‌లో మెరిసిన ఆణిముత్యాల మనోగతం‌

ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఏపీ ఎంసెట్‌లో విద్యార్థులు ర్యాంకులతో మెరిశారు. వాళ్ల తల్లితండ్రుల కలల్ని నెరవేర్చాలనే సంకల్పంతో వైద్య, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. సమాజానికి, దేశ అభివృద్ధికి తమవంతు సహాయం అందిస్తామని అన్నారు. బుధవారం విడుదలైన ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్, వైద్య విభాగాల్లో తొలి మూడు స్థానాలను సాధించిన ఈ ప్రతిభావంతులు.. తమ విజయం పట్ల ఇలా స్పందించారు.

ఇంజనీరింగ్ లో..

'నా తొలి ప్రాధాన్యత ముంబాయి ఐఐటీయే. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 350 మార్కులతో దేశంలోనే ఫస్టు ర్యాంక్ వచ్చింది. ప్రస్తుతం ఎంసెట్‌లోనూ 150 మార్కులు వచ్చాయి. అనుమానం తలెత్తితే నివృత్తి అయ్యేవరకూ నిద్ర పట్టేది కాదు.. బహుశా ఇదే నా విజయ రహస్యం కావచ్చు. రోజూ 9 గంటలు చదివేవాడిని. మూడు సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ఆఖరి పదిరోజులు కెమిస్ట్రీకి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చా'  - సూరజ్ కృష్ణ, ర్యాంక్1

'భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ సాధించి ఉన్నతాధికారిగా సమాజానికి సేవ చేయాలనేదే నా లక్ష్యం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ గృహిణి.  జేఈఈ మెయిన్స్‌లో 5వ ర్యాంకు వచ్చింది. ముంబై ఐఐటీలో చేరాలనుకుంటున్నా' - గట్టు మైత్రేయ, ర్యాంక్2

'ఎంసెట్‌లో రాణించాలంటే ముందుగా అనుమానాలను పరిష్కరించుకోవాలి. అదే నా విజయ రహస్యం. కఠోర సాధనతో పాటు.. సబ్జెక్టులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాణ్ణి. జేఈఈ మెయిన్స్ బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు వచ్చింది' - లోకేశ్వర్ రెడ్డి, ర్యాంక్ 3

 
మెడిసిన్‌లో ..

'మంచి ర్యాంకు వస్తుందనుకున్నా.. కానీ ఫస్టు ర్యాంకు ఊహించలేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి న్యూరాలజిస్టు అవ్వాలన్నదే నా లక్ష్యం. అన్నయ్య మెడికల్ స్టూడెంట్. ఆయన సలహాలు నాకు ఉపయోగపడ్డాయి. తల్లితండ్రుల ప్రోత్సాహం మరువలేనిది.' - జంగాల సాయి సుప్రియ, ర్యాంక్1

'మెడిసిన్‌లో రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న వైద్యాధికారి, అమ్మ గృహిణి. గతంలో అక్కకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రానందుకు ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. అందుకే ఈసారి కష్టపడి చదివా. నీట్, ఎయిమ్స్, జిప్‌మర్ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాను. పేదలకు వైద్యసేవలు అందించాలన్నదే నా లక్ష్యం' - శ్రీవాస్తవ్, ర్యాంక్2

'చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆశయంతో పట్టుదలతో చదివాను. తల్లితండ్రులిద్దరూ వెటర్నరీ వైద్యులే. వారి ప్రోత్సాహం మరువలేనిది. కష్టపడి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చదవడం వల్ల ఈ ర్యాంకు సాధించగలిగాను. ఇదే స్పూర్తితో మరిన్ని మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌లోనూ మంచి ర్యాంకులను సాధిస్తాను. ఎయిమ్స్‌లో చదివి మంచి వైద్యుడిగా సేవలు అందిస్తాను' - కోడూరు శ్రీహర్ష, ర్యాంక్3

Trending News