పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు

పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు

Updated: Nov 15, 2019, 02:25 PM IST
పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు
ANI file photo

అమరావతి: పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసిన దీక్షను దొంగ దీక్షగా అభివర్ణించిన అంబటి రాంబాబు.. బాబు అధికారంలో ఉండగానే ఏర్పడిన ఇసుక కొరత సమస్యను తమ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని అన్నారు. ఇసుక కొరత సమస్యను సరిదిద్దే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇసుక కొరత సృష్టించి డబ్బు చేసుకోవాలని అనుకుంటున్నామని, భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నామని చంద్రబాబు చేస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అంబటి రాంబాబు స్పష్టంచేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి ఇసుక దీక్షలో డ్రామాలు ఆడారని ఆయన మండిపడ్డారు. ఇసుక దీక్షకు టిడిపి మెజారిటి ఎమ్మెల్యేలు హాజరుకాలేదంటే అది తప్పనే వారు భావించి ఉండుంటారు. అందుకే వారు ఇసుక దీక్షకు దూరంగా ఉన్నారని రాంబాబు వ్యాఖ్యానించారు. ఇసుక నుంచి రాజకీయం చేసి తైలం తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబును ఎద్దేవా చేశారు.

ఇక ఇసుక సంగతి అటుంచితే ఇంగ్లీషు మీడియంపై కూడా వివాదం సృష్టించారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసం ప్రవేశపెడితే తప్పేంటి అని ప్రశ్నించిన ఆయన... ప్రపంచంలో పోటీని ఎదుర్కొవడం కోసం సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ గారు ఇంగ్లీషు ప్రవేశపెట్టబోతే దానినీ విమర్శిస్తారా అని నిలదీశారు. జగన్ సర్కార్‌పై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తే అది సమంజసం కాదని ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు హితవు పలికారు.