CJI NV Ramana, CM YS Jagan: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే వేదికపైకి రానున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ తిరుపతి చేరుకున్న ఆయన.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ రానున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆగస్ట్ 20న ఉదయం 7:40 కి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి విజయవాడలో కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ+7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారమే సీజేఐ ఎన్వీ రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు.
2013 లో ఎన్వీ రమణ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సమయంలో ఈ నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎట్టకేలకు ఆ భవనాలకు మళ్లీ ఎన్వీ రమణ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది. 20న నూతన భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఆత్మీయ సన్మానం జరగనుంది. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే వేదికపైకి వస్తున్న సందర్భం కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్వీ రమణ, వైఎస్ జగన్‌ల భేటీకి ఎందుకంత ప్రాధాన్యత ?
ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడానికి ముందే ఆ పదవిని అలంకరించడానికిగాను ఆయనకు ఉన్న అర్హతలను ప్రశ్నిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి, సుప్రీం కోర్టు కొలీజియంకు లేఖలు రాశారు. ఎన్వీ రమణ నియామకంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ఫిర్యాదులు చేశారు. దాదాపు ఎన్వీ రమణ పేరు ఖాయమైపోయిందనే సంకేతాలు వెలువడుతున్న సమయంలోనూ వారికి వ్యతిరేకంగా తన వాదనలు వినిపించడంలో వైఎస్ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఎన్వీ రమణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అంటూ జగన్ బాహటంగానే విమర్శలు గుప్పించారు. అలాంటి వారు దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత హోదా కలిగిన స్థానంలో ఉండరాదంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ నియామకం జరిగిపోవడం, ఆ తర్వాత ఆ వివాదం తెరమరుగైపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే, ఇప్పుడిలా మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై కలుసుకుంటున్న తరుణంలో అప్పటి పాత విషయాలను సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజెన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
ఇదేం మొదటిసారి కాదు..
సీఎం వైఎస్ జగన్, సీజేఐ ఎన్వీ రమణ ఇలా ఒకే వేదికపైకి రావడం ఇదేం మొదటిసారి కాదు.. గతేడాది డిసెంబర్ చివర్లో ఏపీ సర్కారు మర్యాదపూర్వకంగా ఇచ్చిన తేనేటి విందుకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ గురించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్వీ రమణ గారు మన రాష్ట్రానికే గర్వకారణం అని కొనియాడారు. ఈ ఇద్దరూ మరోసారి కలుసుకుంటున్న నేపథ్యంలో గత అనుభవాలు, అప్పటి విషయాలన్నీ నెటిజెన్స్ మధ్య మరోసారి చర్చకొస్తున్నాయి.
Also Read : RBI on AP: ఆర్బీఐ దగ్గర ఏపీ ప్రభుత్వం మారోమారు భారీగా అప్పు..ఆ సొమ్ము ఎంతంటే..!
Also Read : Amaravathi Rythulu: మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు..ఎప్పటి నుంచి అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook