అమరావతి: ఏపీ కేబినెట్ రేపు అవుతుందా లేదా అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కేబినేట్ భేటీకి తాజాగా స్పందించిన ఎన్నికల సంఘం అధికార వర్గాలు.. నాలుగు అంశాలతో కేబినెట్ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుమతి కోరారని తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. ఏపీ కేబినెట్ భేటీ అంశం ఇంకా ఎన్నికల సంఘం పరిశీలనలోనే ఉందని సోమవారం సాయంత్రానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు స్పష్టంచేశాయి.
వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే ఏపీ కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు సైతం చేసింది. అయితే కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అంశాలతో కూడిన ఎజెండా దస్త్రాన్ని భేటీకన్నా 48 గంటల ముందుగా ఎన్నికల సంఘానికి పంపించి, ఎన్నికల సంఘం అనుమతి పొందిన తర్వాతే భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తేల్చిచెప్పడంతో ఈ భేటీ కాస్తా 14వ తేదీకి వాయిదా పడింది.
ఎన్నికల కోడ్ అమలులో వుండగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అవగాహన కల్పించినట్టు గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది ప్రకటించిన సంగతి తెలిసిందే.