తెలంగాణలోని వర్షాల ప్రభావం ఏపీలోని కృష్ణా పరివాహక ప్రాంతం మీద కూడా పడింది. ఇప్పటికే మున్నేరు, కట్లేరు, వైరా మొదలైన వాగులు ఈ ప్రాంతంలో పొంగి ప్రవహించడంతో.. కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు నీటిని విడుదల చేయమని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 11 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్న తూర్పు, పశ్చిమ కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని పూర్తి సామర్ద్యంతో విడుదల చేస్తున్నారు.
ఇదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 14 పంపులను ప్రస్తుతానికి నిలిపివేశారు. అదేవిధంగా పోలవరం కుడికాలువ ప్రవాహం 4 వేల క్యూసెక్కులకు తగ్గడం గమనార్హం. ఈ వరద ప్రవాహం మీద ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేస్తున్నారు. వీలైతే పట్టిసీమ ప్రాజెక్టుకి చెందిన మిగతా పంపులను కూడా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. రేపు ఉదయానికి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 5000 క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు వదిలే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
ఖమ్మంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయమని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా ప్రాంతం మీద కూడా పడింది. తెలంగాణాలోని మధిర ప్రాంతంలో రాత్రి 180 మిలీమీటర్ల మేర వాన కురవడంతో మున్నేరు, వైరా నదులు బాగా పొంగాయి. ప్రకాశం బ్యారేజీ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13,08,000 ఎకరాలకు నీరును అందిస్తోంది.