CM Jagan on DA Arrears: ఇటీవల ఏపీ సర్కారుపై ఉద్యోగులు అసంతృప్తి గళం వినిపిస్తున్న వేళ సీఎం జగన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఒకేసారి ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్ ఇచ్చారు. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగులకు సబంధించి కీలక డిమాండ్లను ఆయన సీఎం ముందు ఉంచారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు.
పెండింగ్ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ల విడుదలకు ఒకే చెప్పిన జగన్.. ఇందుకు సబంధించిన ఉత్తర్వులు ఈ నెలలో జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. మే నెలలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చర్యలు చేపట్టాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా వచ్చే నెలలో జరిగే సాధారణ బదిలీల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి బదిలీల కోసం ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ డీఏలు విడుదలతోపాటు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో ముఖ్యమంత్రికి ఉద్యోగుల తరపున కాకర్ల వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెండింగ్ డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో 18 నెలల డీఏ బకాయిలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. జూలై 2020 నుంచి 18 నెలల వరకు మూడు విడతల డీఏ బకాయిలను విడుదల చేయలేదు. జూలై 2021లో ప్రభుత్వం డీఏని పునరుద్ధరించినా.. పెండింగ్ డీఏపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. పెండింగ్ డీఏ నిధులను విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది. కోవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందని వెల్లడించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఏ క్షణమైన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ నాలుగు శాతం పెరిగిన విషయం తెలిసిందే. గతంలో 38 శాతం ఉండగా.. 42 శాతానికి చేరింది. పెంచిన డీఏను జనవరి నెల నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో డీఏ పెంపు ప్రకటన ఆగస్టులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి కూడా 4 శాతం పెరగనుందని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook