ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

Last Updated : Oct 9, 2018, 09:21 AM IST
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం మరో 24 గంటల్లోపు తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కళింగపట్నం-గోపాల్‌పూర్ వద్ద ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వివరించారు.

ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని సమాచారం. అటు ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో.. అక్కడి అధికార యంత్రాగం అప్రమత్తమైంది.

మరోవైపు నైరుతి రుతుపవనాలు తిరోగమనం చివరి దశకు చేరుకుందని, ఇది పూర్తిగా తిరోగమించిన తర్వాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అటు దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆవరించిన ఆవర్తనంతో పాటు, మధ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా, ఒడిశా దిశగా పయనిస్తుందని.. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Trending News