జనసేన పార్టీని రాజకీయ లబ్ది గల పార్టీగా చూడకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై స్పందించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య విషయాలు
*ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా చేశారు. ఒక పద్ధతి అనేది లేకుండా విభజన చేశారనే ఆవేదనతోనే మేము జనసేన పార్టీ స్థాపించాం
*సింగపూర్ లాంటి పరిపాలన కావాలని భావిస్తే.. అక్కడి నాయకుల గురించి తెలుసుకోండి. లీక్వాన్యూ ఎలా సంస్కరణలు తీసుకొచ్చారో ఇంటర్నెట్లో చూడండి. అక్కడ వివిధ జాతుల వారు ఉన్నారు. వారు గొప్ప త్యాగాలు చేశారు. అందరికీ న్యాయం జరగాలని భావించారు. అందుకే సింగపూర్ అందరికీ ప్రమాణమైంది. మన పాలకులు కూడా ఇలాంటి విషయాలను ఆదర్శంగా తీసుకోవాలి
*ఏపీలో కులాల గొడవలు ఎక్కువగా ఉంటాయి. అమరావతిని విశ్వనగరంగా నిర్మించాలని భావిస్తే.. అసమానతలు తొలగించే ప్రయత్నం చేయాలి
*ప్రభుత్వాలు ‘ఓట్లేస్తేనే అభివృద్ధి చేస్తాం’ అని అనకూడదు. సమన్యాయం చేయాల్సిన బాధ్యత పరిపాలన చేసే ప్రభుత్వాలపై ఉంది
*చండీగఢ్‌ను తొలి దశలో భాగంగా 7,50 0వేల ఎకరాలతో, ఆ తర్వాత 8,500 ఎకరాలతో అభివృద్ధి చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రే విశాల నగరం కట్టేయాలనే కోరిక అందరికీ ఉండవచ్చు. కానీ భూములను అవసరం మేరకే తీసుకోవాలని నేను అంటాను
*నా వల్ల సమస్యకు ఒక పరిష్కారం రాకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టికి మాత్రం తప్పకుండా వెళ్తుంది