Contractor Locked Village secretariat: బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి గతంలో హైకోర్టు తలంటినా.. పాలక యంత్రాంగంలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. పనులు చేయించుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో అధికారుల ప్రదర్శిస్తున్న అలసత్వం విమర్శలకు తావిస్తోంది. రేపు రా..మాపు రా అంటూ చెప్పులు అరిగేలా కొందరు అధికారులు తిప్పించుకుంటున్నారు. అయితే అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ కాంట్రాక్టర్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వైఎస్ ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీ లోని గ్రామ సచివాలయాన్ని 48 లక్షలతో నిర్మించారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డికి 32 లక్షలు చెల్లించారు. అయితే ఇంకా 16 లక్షల మేర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా ఈ పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దాంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ..ప్రభుత్వ అధికారుల వైఖరినికి నిరసనగా తాను నిర్మించిన గ్రామ సచివాలయ భవనానికి తాళం వేశారు. దీంతో సచివాలయ ఉద్యోగులు బైటే ఉండాల్సి వచ్చింది.
తనకు రావాల్సిన బిల్లుల కోసం ఏడాదిన్నర క్రితమే అధికారులకు ఐదు శాతం కమీషన్‌కు కూడా చెల్లించానని అయినా బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిల్లులు ఆలస్యం కావడంతో వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు రావలసిన బిల్లులో 8 లక్షలు మంజూరైనా సంబంధిత అధికారులు బిల్లులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతున్నాడు.
సీఎం సొంత జిల్లాలోనే ఇలా ఉందంటే..మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సచివాలయ భవనానికి తాళం వేసి కాంట్రాక్టర్ మంచి పని చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడైనా అధికారులకు కనువిప్పు కలుగుతుందని అంటున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Niharika Put End for Rumors: భర్తతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన నిహారిక
Also Read: Avatar 2 Trailer: జేమ్స్ కెమెరూన్ భారీ ప్లాన్.. 160 భాషల్లో 'అవతార్ 2' రిలీజ్!