హిందూ మహా సముద్రం-ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారడంతో రానున్న రెండు రోజులపాటు ఆంధ్రా, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయానికి చెన్నైకి 1490 కిమీ దూరంలో కేంద్రీకృతమై వున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వారాంతంలో శ్రీలంక తీరం గుండా ప్రయాణిస్తూ మంగళవారం సాయంత్రానికి తమిళనాడు, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతానికి చేరే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాన్ తీరాన్ని తాకే సమయంలో 100 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, మంగళవారం నాటికి గాలుల వేగం 125 కిమీ వేగాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగానే తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అకాల వర్షాలతో కుదేలైన రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ఆంధ్రా, తమిళనాడుకు భారీ వర్షాలు