విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తూ మోడీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో రాజకీయపార్టీలు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క అకాలీదళ్ మినహా మిగిలిన విపక్ష పార్టీలన్నీ అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్డీయే భాగస్వామి అయిన శివసేన పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే తమ నిర్ణయాన్ని మధ్యాహ్నానికల్ల ప్రకటిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.
మద్దతు కూడగడుతున్న కాంగ్రెస్
కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసంపై రాజకీయపార్టీల మద్దతు కోసం స్వయంగా కాంగ్రెస్ పార్టీయే బరిలోకి దిగడం గమనార్హం. విపక్షాల మద్దతు కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జు ఖర్గే, ఆజాద్, జోతిరాధిత్య సింధియా రంగంలోకి దిగి సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 20 విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు ప్రయోగించిన అవిశ్వాసం అస్త్రం మోడీ సర్కార్ కు తలనొప్పిగా మారింది.