దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 95వ జయంతి నేడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించి, ఆయన్ను గుర్తుచేసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరి, డైరెక్టర్ క్రిష్ తదితరులు ఉన్నారు.
అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎన్టీ రామరావు గురించి చెప్పడానికి తరాలు, యుగాలు సరిపోవని తెలిపారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, అలాగే ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టములను పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు.
ఏపీలోని కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలని పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజును తెలుగు జాతి పండుగగా గుర్తించాలన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని హరికృష్ణ కోరడం సబబేనన్నారు. ఎన్టీఆర్ వంటి మహానటుడు మరొకరు పుట్టలేరని..తెలుగు జాతి గర్వించే చిత్రాల్లో నటించి మెప్పించిన వ్యక్తిగా ఎన్టీఆర్ కీర్తికెక్కారని కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్పూర్తితోనే సినిమా రంగంలో అడుగుపెట్టానని.. ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతను అప్పగించిన బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ క్రిష్.