సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలతో, భావోద్వేగాలతో తెలుగుదేశం పార్టీ చెలగాటమాడిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ కూడా నాలుగేళ్లపాటు రాష్ట్రానికి ఏమీ చేయని సీఎం చంద్రబాబు.. అంతా జరిగిపోయి పరిస్థితులు చేజారిన తర్వాత మేల్కొన్నారని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో చంద్రబాబు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప ఇక చేసేదేం లేదని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, మరోవైపు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టిన పవన్ కల్యాణ్... గుంటూరులో అతిసార వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే, గుంటూరు బంద్ చేపట్టడానికైనా వెనుకాడనని స్పష్టంచేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభా వేదికపై నుంచి మాట్లాడింది మొదలు.. ఎప్పటికప్పుడు చంద్రబాబుపై పవన్ కల్యాణ్ చేస్తోన్న ఆరోపణలు ఆ ఇద్దరి మధ్య దూరాన్ని అంతకంతకూ పెంచేస్తున్నాయి. గత ఎన్నికల్లో మిత్రపక్షమైన ఈ ఇద్దరూ ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిజీగా వున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ సైతం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు అందుకు అధికార పార్టీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితులు కల్పించి ఓ విధంగా అధికార పార్టీపై పైచేయి సాధించింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా ఎన్డీఏలో కొనసాగితే, రాష్ట్రంలో మరిన్ని ఆరోపణలు ఎదుర్కోక తప్పదని భావించిన టీడీపీ.. శుక్రవారం ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి కూటమి నుంచి పక్కకు తప్పుకుంది. ఈ వరుస పరిణామాల మధ్య రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.