శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ జన పోరాట యాత్ర కొనసాగుతోంది. రెండో రోజు ఆయన సోంపేట, పలాస ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోంపేట బీల భూములను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సోంపేట బీల సమస్యను పరిష్కరించే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
అభివృద్ధి పేరుతో పర్యవరణాన్ని ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు. అలాంటి విధానాలను జనసేన వ్యతిరేకమని అన్నారు. జనసేన చేస్తున్న పోరాటానికి రైతులు, యువత కలిసి రావాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కోరారు. రైతు, యువత సమస్యలే తమ ప్రధాన అజెండా అని..వారి సమస్యలపైనే జనసేన కార్యకర్తలు పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.