తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు. ఒకానొక సందర్భంలో రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు దేవుడని మొక్కితే చంద్రబాబు దెయ్యమై కూర్చున్నారని పవన్ అన్నారు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వకూడదని.. అలాగే వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ కూడా తెలుగుదేశం నేతలు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడం లేదంటే.. ఆయనకీ వాటా ఉందని అనుకోవాల్సి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
అవినీతి గురించి ఎప్పుడూ మాట్లాడినా.. నారా లోకేష్ ఎక్కడుందని ప్రశ్నిస్తుంటారని.. కానీ ఆయన పెద్దాపురంలోని సూరంపాలెం లాంటి చోట్లకు వచ్చి మాట్లాడాలని.. అప్పుడు తమ ప్రభుత్వ అవినీతి వారు కళ్లారా చూడవచ్చని పవన్ తెలిపారు. రాబోయేవి సంకీర్ణ రాజకీయాలే అని పవన్ తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పు కోసమే జనసేన పుట్టిందని ఈ సందర్భంగా పవన్ అన్నారు.
అలాగే కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమావేశంలో కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ‘ఇల్లు అద్దెకు ఇస్తారా? అని అడిగే దౌర్భాగ్యం మీకెందుకు తల్లీ? వేరేవాళ్లు వచ్చి మిమ్మల్ని ఇల్లు అద్దెకు అడగాలి. అలాంటి జీవితాన్ని మీకు జనసేన అందిస్తుంది. రెల్లి కులస్థులైన మీరు బాధపడడం ఏమిటి? అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచే మీరు గొప్ప కులస్థులు. అలా చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. అంత పెద్ద మనసు రెల్లి కులస్థులకే ఉంది. ఈ రోజు నుంచి మీ గొంతు నాది. మీరు బాధ పడకండి. మీకు అండగా ఉంటా.’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.