బీజేపీలో చంద్రబాబు మనుషులు: పేర్ని నాని

బీజేపీలో చంద్రబాబు మనుషులు: పేర్ని నాని

Updated: Oct 25, 2019, 05:45 PM IST
బీజేపీలో చంద్రబాబు మనుషులు: పేర్ని నాని

అమరావతి: కేంద్రమంత్రి అమిత్‌షాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లవ్‌ లెటర్లు ఎందుకు రాస్తున్నారని మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని, ఆ తర్వాత జుట్టుపట్టుకున్నారని, ఇప్పుడు మళ్లీ బీజేపీతో దూరమై తప్పు చేశామని అంటున్నారని నాని అన్నారు. బీజేపీతో సంబంధాల కోసం చంద్రబాబే తన మనుషుల్ని బీజేపీలో చేర్చారని పేర్ని నాని ఆరోపించారు. తప్పులు చేయడం చంద్రబాబుకు కొత్త కాదని, మాజీ సీఎం ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానన్న ప్రకటించిన చంద్రబాబు.. ఓడిపోయాక తిరిగి ఆయన చెంతకే చేరారని గుర్తుచేసుకున్నారు. 

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. సీఎం జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజమని, చంద్రబాబు చెప్పిందే పవన్‌ మాట్లాడుతారని ఆరోపించారు. అమెరికాలో బేరం కుదర్చుకుని సీట్లు అమ్ముకున్న పవన్ కల్యాణ్‌కి ముఖ్యమంత్రి జగన్‌ని విమర్శించే హక్కు లేదన్నారు. జగన్‌పై దాడి జరిగితే.. కోడికత్తి అని అవహేళన చేస్తారా అని ఆవేదన వ్యక్తంచేశారు.