2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్రానికి మొరపెట్టుకుంటున్న టీడీపీ నేతలు.. కేంద్రంపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా... టీడీపీ నేతలు ఆ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోడీ ప్రసంగం అనంతరం వాయిదా పడిన లోక్‌సభ తిరిగి సాయంత్రం ప్రారంభమైంది. దీంతో ఏపీ డిమాండ్ల కోసం అప్పటి వరకూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు.
" స్పీకర్ ఇచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మైక్ పట్టుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. కేంద్రం ఇప్పటివరకు ఏపీకి ఇచ్చిన హామీలని ఏకరువు పెట్టారు. అంతేకాకుండా అందులో ఇప్పటివరకు ఏదీ నెరవేరలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా త్వరలోనే కర్ణాటకలో ఎన్నికలు వున్నందున కేంద్రం బెంగుళూరు మెట్రోకి నిధులు ఇచ్చింది కానీ ఈ బడ్జెట్‌లో విశాఖ, విజయవాడ మెట్రోల ఊసే ఎత్తలేదు అని అన్నారు.
"కేంద్రం ఇలాగే చేస్తే కాంగ్రెస్‌కి, బీజేపి పెద్ద తేడా వుండదు. ఇంకా హామీలు ఇస్తూ పోతే అవి వింటూ కూర్చోవడానికి ఏపీ జనం ఫూల్స్ కాదు" అని ఘాటుగా వ్యాఖ్యానించిన గల్లా జయదేవ్.. "కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులకన్నా, బాహుబలి సినిమా కలెక్షన్లే అధికంగా ఉన్నాయని జనం జోక్‌లు వేసుకుంటున్నారు" అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు, బాహుబలి కలెక్షన్స్‌కి లింకు పెట్టి జనం నవ్వుకుంటున్నారని గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు విని సభ్యులంతా ఘొల్లుమన్నారు.