ఏపీకి ప్రత్యేక హోదాకు టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ రోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం తెలుగు ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలన్నదే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందన్నారు. తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని ఈ సందర్భంగా కోటమిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ అభివృద్ధి
ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం నేతలకు మాత్రమే అందుతున్నాయని.. ప్రయోజనాలు సామన్య ప్రజలకు అందినప్పుడే తాను సంతోషిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాగితాలపై తప్ప..వాస్తవంగా లేదని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అంతమైతేనే తెలంగాణ ప్రజలకు మేలు కులుగుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.