కమల్ హాసన్ ప్రముఖ తమిళ నటుడు. తమిళంలో పాటు హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించిన కమల్‌ను అభిమానులు లోకనాయకుడిగా అభివర్ణిస్తారు. నవంబర్ 7, 1954 తేదీన తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో జన్మించిన కమల్ హాసన్ మూడున్నర ఏళ్ళ వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన నటించిన తొలి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". హీరో కాకముందు కొన్ని చిత్రాల్లో డ్యాన్స్ మాస్టరుగా కూడా పనిచేసిన కమల్, దర్శకుడు కె.బాలచందర్ పరిచయమయ్యాక ఆయనతో కలసి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన "మరో చరిత్ర" చిత్రం ఆయన కెరీర్ గ్రాఫ్‌నే తిరగరాసింది. ఆ తర్వాత కమల్ నటించిన అవర్ గళ్, ఇళమై ఊన్జలాడుగిరదు, సిగప్పు రోజక్కళ్ , కళ్యాణరామన్, అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్ వంటి చిత్రాలు ఆయనకి తమిళంలో ఒక మంచి మాస్ ఫాలోయింగ్‌ని తీసుకొచ్చాయి.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న నటుడు కమల్ హాసన్. 1980వ దశకంలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు కమల్‌లోని నటుడిని జాతీయ స్థాయి సినీ విమర్శకులకు సైతం పరిచయం చేశాయి. సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతిని పొందాడు కమల్. రాజ పార్వయి, కాకి చట్టై, అపూర్వ సగోదరర్‌గళ్ లాంటి చిత్రాలలో నటనకు కమల్‌కు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్ హసన్ 1981 నుండి రాజ్‌కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో "పుష్పక విమానం" అనే మూకీ చిత్రంలో నటించారు. 1985లో వచ్చిన హిందీ చిత్రం "సాగర్" కమల్ హాసన్‌కి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కట్టబెట్టింది. ఇదే దశకంలో యాద్‌గార్, రాజ్ తిలక్, కరిష్మా, గిరఫ్తార్, దేఖా ప్యార్ తుమ్హారా, ప్యార్ తరనా,ఏక్ దుజే కేలియే, లాంటి హిందీ సినిమాల్లో కూడా కమల్ నటించారు.
90వ దశకంలో కమల్ నటించిన సతీ లీలావతి, మైఖేల్ మదన్ కామరాజ్, గుణ, దేవర్ మగన్, మహానది, నమ్మవర్, ద్రోహి, ఇండియన్, అవ్వై షణ్ముఖి వంటి చిత్రాలు కమల్ హాసన్‌లోని నటుడిని తారాస్థాయికి తీసుకెళ్లాయి. తెలుగులో 1995లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన "శుభసంకల్పం" చిత్రం కమల్ నటనను తెలుగువారికి మరోసారి రుచి చూపించింది. తెలుగులో వచ్చిన "భామనే సత్యభామనే" చిత్రం "చాచీ 420" పేరుతో హిందీలో కూడా విడుదలైంది. 2000ల్లో కమల్ అనేక ప్రయోగాత్మక చిత్రాలతో పాటు, హాస్యప్రధాన చిత్రాల్లో కూడా నటించడానికి సంకల్పించారు. అభయ్, పంచతంత్రం, బ్రహ్మచారి, అన్బే శివమ్, విరుమాండి, ముంబై ఎక్స్‌ప్రెస్, వేట్టైయాడు - విళయాడు, తెనాలి లాంటి చిత్రాలు కమల్ స్థాయిని మరింత పెంచాయి. 2007లో దశవతారం, 2013లో విశ్వరూపం, 2015లో వచ్చిన చీకటి రాజ్యం చిత్రాలతో కమల్ హాసన్ ప్రయోగాల పరంపర కొనసాగింది.
అవార్డులు - రివార్డులు
తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు - కలైమామణి (1979)భారత ప్రభుత్వ పురస్కారాలు - పద్మశ్రీ (1990), పద్మభూషణ్ (2014)
జాతీయ పురస్కారాలు - కలత్తూర్ కన్నమ్మ (బాలనటుడిగా జాతీయ పురస్కారం)
అంతర్జాతీయ పురస్కారాలు - విరుమాండి (2004) చిత్రానికి పుచాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఆసియా సినిమా అవార్డు గెలుచుకుంది. 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వం గౌరవ పురస్కారం అందించింది.
విజయ్ అవార్డ్స్ - శివాజీ గణేషన్ అవార్డు (2006)
ఫిక్కీ అవార్డు - లివింగ్ లెజెండ్ అవార్డు (2007)
సీఎన్‌ఎన్ ఐబిఎన్ పురస్కారాలు - ఇండియన్ ఆఫ్ ది ఇయర్ (2010)
కేరళ రాష్ట్ర పురస్కారాలు - గౌరవ పురస్కారం (2010)
ఆసియా నెట్ చలనచిత్ర అవార్డులు - పాపులర్ తమిళ్ నటుడు (2013)
ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు - 1985లో సాగర్ చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు, 1997లో విరాసత్ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా పురస్కారం అందుకున్నారు
నంది పురస్కారాలు - సాగర సంగమం (1983), స్వాతి ముత్యం (1986), ఇంద్రుడు చంద్రుడు (1989)