చిన్నోడి ప్రాణం కాపాడిన మహేష్ బాబు

రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టారే అనిపించుకుంటున్న మహేష్ బాబు

Last Updated : Jan 29, 2018, 11:09 PM IST
చిన్నోడి ప్రాణం కాపాడిన మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు సైన్ చేసే ప్రకటనల ద్వారా వచ్చిన పారితోషికంలో కొంతమొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సతీమణి, నటి నమ్రతా శిరోద్కర్ కూడా వెల్లడించారు. మహేష్ బాబు చేయుతనిచ్చే సేవా కార్యక్రమాలని పర్యవేక్షించే బాధ్యతలు కూడా ఆమె తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద బాల, బాలికలకు మహేష్ బాబు దంపతులు అందిస్తున్న సహాయం పలు సందర్భాల్లో మీడియాలోనూ ప్రస్తావనకు వచ్చింది.

ఇదిలావుంటే, తాజాగా టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. తాను చేస్తోన్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ పసివాడి ప్రాణం కాపాడేందుకు మహేష్ బాబు చేసిన ప్రయత్నం ఫలించిందని తెలుస్తోంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లోడు తనీష్‌ని ఆ వ్యాధి బారి నుంచి రక్షించడం కోసం మహేష్ బాబు చేసిన సహాయం మరువలేనిది అని తాజాగా ఓ బాలుడి కుటుంబం మహేష్ బాబుకి కృతజ్ఞతలు చెప్పుకుంది. 

తనీష్ వైద్యానికి అవసరమైన మొత్తాన్ని మహేష్ బాబు సమకూర్చారని, ఆయన వల్లే ఈరోజు తమ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసిందని తనీష్ కుటుంబం సంతోషం వ్యక్తంచేసింది. తనీష్‌కి క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైన అనంతరం కుటుంబసభ్యులతోసహా మహేష్ బాబుని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఆ కుటుంబం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త మహేష్ బాబు సేవాభావాన్ని చాటిచెప్పింది.

Trending News