నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

దక్షిణాదిన తెలుగు, మళయాళం, కన్నడ భాషా చిత్రాలతో బిజీగా వున్న ప్రియమణి తాజాగా ఓ తెలుగు సినీ నిర్మాతపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వార్తల్లోకెక్కింది.

Last Updated : Mar 15, 2018, 04:37 PM IST
నిర్మాతపై ఫిర్యాదు చేసిన ప్రియమణి

దక్షిణాదిన తెలుగు, మళయాళం, కన్నడ భాషా చిత్రాలతో బిజీగా వున్న ప్రియమణి తాజాగా ఓ తెలుగు సినీ నిర్మాతపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేసింది. త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతున్న అంగుళీక అనే చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజైంది. ఈ సినిమా నిర్మాతపైనే ప్రియమణి మా అసోసియేషన్‌కి ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈ సినిమాకు, ప్రియమణికి ఏ సంబంధం లేదు. సినిమాతో ఆమెకు ఏ విధమైన సంబంధం లేనప్పుడు మరి నిర్మాతపై ఎందుకు ఫిర్యాదు చేసింది అనే సందేహం రావచ్చేమో! అయితే అంతకన్నా ముందుగా అంగుళీకం సినిమాపై ఆమెకు ఆగ్రహం రావడం వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలి.

అంగుళీకం సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికన్నా ముందుగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ప్రియమణిని ఆశ్రయించారు ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత. అయితే, ఏవేవో కారణాలతో ప్రియమణి ఆ సినిమాకు సైన్ చేయలేదు. అనంతరం మరో హీరోయిన్‌తో అంగుళీకం సినిమాను తెరకెక్కించారు. ఇక్కడి వరకు బాగానే వున్నా... ఇటీవల రిలీజైన టీజర్‌లో తన ఫోటోని వాడుకున్నారు అనేదే ఇప్పుడు ప్రియమణి చేస్తోన్న ప్రధానమైన ఆరోపణ. 

తన అనుమతి లేకుండా తన ఫోటోను వాడుకున్నందుకు తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రియమణి మా అసోసియేషన్‌కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ హరినాథ్ సైతం స్వయంగా ధృవీకరించినట్టు సమాచారం. 

Trending News