మార్చి 1 నుంచి థియేటర్ల బంద్ తప్పదా ?

మార్చి ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యజమానులు బంద్‌ పాటించనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Feb 22, 2018, 02:41 PM IST
మార్చి 1 నుంచి థియేటర్ల బంద్ తప్పదా ?

మార్చి ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యజమానులు బంద్‌ పాటించనున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అదే సమయంలో తమ సినిమాలను విడుదల చేయాలనుకున్న దర్శకులు, నిర్మాతల వెన్నులో వణుకు మొదలైంది. తమకు ఇష్టం వచ్చినట్టుగా సర్వీస్  ఛార్జీలు వసూల చేస్తూ నిర్మాతల్ని, పంపిణీదారుల్నీ దోచుకొంటున్న డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు దిగిరాకపోతే మార్చి ఒకటి నుంచి థియేటర్లు మూసి వేయడానికైనా వెనుకాడబోం అంటోంది తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌. తమిళనాడు, కేరళ, కర్నాటక ఫిల్మ్‌ చాంబర్స్‌ కూడా ఈ నిరసనకు మద్దతు పలకడంతో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌పై ఒక రకంగా ఒత్తిడి అధికమైందనే చెప్పుకోవచ్చు. అదే కానీ జరిగితే, మార్చి 1వ తేదీ నుంచి దక్షిణాదిన వున్న ఐదు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ బాట పట్టడం ఖాయం.
 
ఒకప్పుడు రీళ్ల ద్వారా జరిగిన సినిమాల పంపిణీ వ్యాపారం స్థానంలో ఇప్పుడు శాటిలైట్‌ పరిజ్ఞానం వచ్చి చేరింది. శాటిలైట్ ద్వారా జరుగుతున్న సినిమా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో వున్న డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తూ తమను దోచుకుంటున్నారనేది సినీరంగంలోని నిర్మాతలు చేస్తోన్న ప్రధానమైన ఆరోపణ. 

దక్షిణాదిన వున్న అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ఏకతాటిపైకి వచ్చి చేస్తోన్న ప్రధానమైన డిమాండ్లు ఇలా వున్నాయి. 
* వెంటనే వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్‌) పేరిట వసూలు చేస్తోన్న ఛార్జీలను వీలైతే పూర్తిగా రద్దు చేయాలి లేదా భారీ మొత్తంలో తగ్గించాలి. 
* సినిమా ఆరంభంలో, మధ్యలో ప్రదర్శిస్తోన్న ప్రకటనలను 8 నిమిషాలకు కుదించాలి. 
* ప్రతీ సినిమా ప్రదర్శనలో రెండు కొత్త సినిమాల ట్రైలర్స్‌ ఉచితంగా ప్రదర్శించేందుకు వీలు కల్పించాలి. 

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌పై ఉద్యమానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో క్యూబ్‌ సిస్టమ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్‌గా వున్న నిర్మాత, పంపిణీదారుడు అల్లు అరవింద్‌, పిఎక్స్‌డీకి నిర్మాత, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్‌ ప్రసాద్‌ చొరవ తీసుకొంటే సమస్యకు మరింత త్వరగా పరిష్కారం లభిస్తుందని చాలా మంది నిర్మాతలు అబిప్రాయపడుతున్నారు.

Trending News