నటీనటులు : వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, క్రితి శెట్టి, సాయి చంద్, జయకృష్ణ తదితరులు
కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఆర్ట్ : మోనిక రామకృష్ణ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిడివి : 147 నిమిషాలు
విడుదల తేది : 12 ఫిబ్రవరి 2021
Uppena movie review: మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. మరి డెబ్యూ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి విజయం అందుకున్నాడు ? ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన బుచ్చి బాబు ప్రేక్షకులను మెప్పించి అంచనాలను అందుకున్నాడా ? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుండే బేబమ్మ (కృతి శెట్టి) మీద ఇష్టం పెంచుకున్న ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాదిస్తూ ప్రేమిస్తుంటాడు. బేబమ్మ కాలేజీలో చేరేసరికి తన మనసులో ప్రేమను ఆమెకి చెప్తాడు. జాలరి కుర్రాడైన ఆశీర్వాదం స్వచ్చమైన ప్రేమకు బేబమ్మ ఫీదా అయి అతని ప్రేమలో పడుతుంది. ఊరికి పెద్దగా ఉండే రాయనం (విజయ్ సేతుపతి) తన కూతురు బేబమ్మ ఓ జాలరి కుర్రాడితో ప్రేమలో పడిందని తెలుసుకొని చివరికి ఆశీని ఊహించని విధంగా హింసకు గురిచేస్తాడు. ఇంతకీ ఆశీ -బేబమ్మ ప్రేమకథలో ట్విస్ట్ ఏమిటి ? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు :
వైష్ణవ్ తేజ్‌కి ఇద మొదటి సినిమానే అయినప్పటికీ అనుభవం ఉన్న హీరోలా నటించాడు. పల్లెటూరి కుర్రాడు ఆశీర్వాదం పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా కొన్ని లవ్ , ఎమోషనల్ సన్నివేశాల్లో ఉత్తమ నటన కనబరిచి మంచి మార్కులు అందుకున్నాడు. బేబమ్మ పాత్రతో కృతి శెట్టి సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్‌గా మెప్పించి యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది.
పవర్‌ఫుల్ క్యారెక్టర్ రాయనంగా విజయ్ సేతుపతి తన విలనిజంతో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. కొన్ని సన్నివేశాలకు తన సెటిల్డ్ నటనతో బలం చేకూర్చాడు. తండ్రి పాత్రలో సాయి చంద్ ఆకట్టుకున్నాడు. ఓ సన్నివేశంలో తన నటనతో విజయ్ సేతుపతిని కూడా డామినేట్ చేశాడు. తాళింపు పాత్రలో జయకృష్ణ బాగా నటించాడు. ఈ సినిమా తర్వాత ఆ అబ్బాయికి మరిన్ని మంచి పాత్రలొస్తాయి. రామరాజు, ప్రియ, క్రాంతి మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అనే చెప్పుకోవాలి. తన మ్యూజిక్‌తో మేజిక్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పిన దేవి సాంగ్స్‌తో అదరగొట్టాడు. ఆల్బంలోప్రతీ పాట వినసొంపుగా ఉండటంతో పాటు చూడ ముచ్చటగా అనిపించింది. అలాగే దేవి అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. శ్రీమణి , చంద్రబోస్ సాహిత్యం పాటలకు ప్రాణం పోసింది. దేవి మ్యూజిక్ తర్వాత మస్ట్‌గా చెప్పుకోవాల్సింది శ్యాం దత్ సినిమాటోగ్రఫీ గురించే. తన కెమెరా పనితనంతో సినిమాకు మంచి విజువల్స్ అందించాడు శ్యామ్.
నవీన్ నూలి ఎడిటింగ్ పర్ఫెక్టుగా ఉంది. మోనికా రామకృష్ణ ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను అలరించాయి. హీరో హీరోయిన్‌కి ప్రసన్న దంతులూరి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ బాగున్నాయి. బుచ్చి బాబు ఎంచుకున్న కథ రొటీనే అయినా స్క్రీన్ ప్లే -డైలాగ్స్ కథకి బలం చేకూర్చాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. నిర్మాతలు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రొడక్షన్ వాల్యూస్ రూపంలో సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది.
Also read : Uppena Trailer : అంచనాలు పెంచిన ఉప్పెన ట్రైలర్
ఏ ప్రేమకథకైనా హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అలాగే వర్కౌట్ అయ్యే లవ్ స్సీన్స్ , స్ట్రాంగ్ విలన్ ముఖ్యం. వీటితో పాటు ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఉప్పెన మూవీలో ఇవన్నీ ఉండేలా చూసుకున్నాడు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, Krithi Shetty మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. మొదటి భాగంలో వచ్చే ప్రేమ ట్రాక్ , సన్నివేశాలు బాగున్నాయి. విజయ్ సేతుపతి విలనిజం కథకి బలాన్నిచ్చింది. సినిమాలో ఉన్న మెయిన్ ఎమోషన్ క్యారీ అయ్యింది. కాకపోతే అక్కడక్కడా బోర్ కొట్టించింది. నిజానికి ఇలాంటి పాయింట్‌తో రసవత్తరంగా సాగే ప్రేమకథను తెరకెక్కించడం కత్తి మీద సాములాంటి వ్యవహారం. దానికి చాలా అనుభవం కావాలి. దర్శకుడు బుచ్చిబాబుకి ఇదే తొలి సినిమా కావడంతో మొదట భాగాన్ని లవ్ స్టోరీతో బాగానే నడిపించాడు కానీ రెండో భాగంలో అక్కడక్కడా తడబడ్డాడు. అందువల్ల సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.
హీరో, హీరోయిన్ కొత్త వాళ్ళయినప్పటికీ వారి నుండి మంచి నటన రాబట్టాడు దర్శకుడు. క్యారెక్టర్స్‌కి బెస్ట్ ఇచ్చే Vijay Sethupathi, సాయి చంద్ వంటి గొప్ప నటులను తీసుకోవడం సినిమాకి కలిసొచ్చింది. విజయ్ సేతుపతి రెండో భాగాన్ని కొంత వరకు తన నటనతో నిలబెట్టాడు. కాకపోతే విజయ్ సేతుపతికి రవిశంకర్ డబ్బింగ్ మొదట్లో కొంచెం ఎబ్టెట్టుగా అనిపించినప్పటికీ.. పోను పోను అలవాటైపోయింది. అలాగే క్లైమాక్స్‌లో కృతి మంచి నటి అనిపించుకుంది. Vaisshnav Tej కూడా హీరోగా మంచి మార్కులే అందుకున్నాడు.
Also read : Uppena Movie Leaked: ఉప్పెన నిర్మాతలకు తొలిరోజే షాక్, ఆన్‌లైన్‌లో ఉప్పెన మూవీ లీక్!
కథ పరంగా ఉప్పెన మూవీ చాలా ప్రేమకథలను గుర్తుచేస్తుంది. మన తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమాలు కూడా అక్కడక్కడా గుర్తొస్తాయి. కాకపోతే కథనం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ప్రేమకథ జరిగే నేపథ్యం, కథలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ కొత్తగా అనిపిస్తాయి. కాకపోతే ఆ మెయిన్ ఎలిమెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికే లీక్ అవ్వడం వల్ల అది అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అది తెలియకుండా ఉంటే ఎమోషన్ ఇంకా బాగా పండి ఉండేది. తన కూతురు ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన సంగతి ఊరి జనాలకి తెలియకుండా తన పరువు కాపాడుకుంటూ బేబమ్మ ఇంట్లోనే ఉందంటూ చెప్పే రాయనం సన్నివేశంతో సినిమాను మొదలుపెట్టిన Director Buchi Babu ఆ తర్వాత కొన్ని నెలల క్రితం అంటూ హీరో, హీరోయిన్ ఎంట్రీ వారిద్దరి మధ్య ప్రేమకథను ఎలివేట్ చేస్తూ వచ్చే సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు.
అలాగే ఆల్బంలో క్లిక్ అయిన నాలుగు పాటలు మొదటి భాగంలోనే పెట్టేసి ఫస్ట్ హాఫ్‌కి మరింత బలం చేకూర్చాడు. కాకపోతే రెండో భాగంలో వచ్చే సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి కొత్తగా ట్రీట్‌మెంట్ ఇచ్చి కథను మరింత వేగంగా నడిపించి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు Eeshwara parameshwara song, ఎమోషనల్ డైలాగ్స్‌తో రెండో భాగాన్ని గట్టెక్కించాడు బుచ్చి బాబు.
Uppena movie లో ఉన్న మెయిన్ సోల్‌ని గీతా భాస్కర్, విజయ్ సేతుపతి క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ ద్వారా ముందే చెప్పేశాడు బుచ్చిబాబు. ఆ రెండు డైలాగులు మళ్ళీ క్లైమాక్స్‌లో రిపీట్ చేస్తూ ఈ కథ ద్వారా తను చెప్పాలనుకున్నది ఎక్కడ అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ నిజాయితిగా చెప్పాడు. చివరిలో శివుడి విగ్రహం ముందు ఓ వృద్దుడు చెప్పే డైలాగ్ , ఎండింగ్ టైటిల్స్‌లో సుకుమార్ వాయిస్ ఓవర్ ద్వారా దాన్ని ఇంకాస్త పొయెటిక్‌గా కన్వే చేశారు. ఫైనల్‌గా భారీ అంచనాలతో థియేటర్స్‌లోకొచ్చిన ప్రేక్షకులను ఈ ప్రేమకథ నిరాశ పరచదు.
రేటింగ్ : 3 /5
Courtesy: జీ సినిమాలు సౌజన్యంతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook