శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె-రణ్‌వీర్ సింగ్ జంట- వీడియో

వివాహం తర్వాత తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె-రణ్‌వీర్ సింగ్ జంట 

Last Updated : Nov 14, 2019, 01:53 PM IST
శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె-రణ్‌వీర్ సింగ్ జంట- వీడియో

తిరుమల: ప్రముఖ బాలీవుడ్ సినీ తారల జోడీ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది నవంబర్ 14-15 తేదీలలో కొంకని-సింధి సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట నేడు తమ మొదటి పెళ్లి రోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా మొక్కును చెల్లించుకునేందుకు తిరుమల చేరుకున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో పాటు రేణిగుంటకి వచ్చిన ఈ జంట.. రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేసారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో ఉత్తర భారతదేశ సంప్రదాయ వస్త్రధారణలో స్వామి వారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం ముందుగా ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని, అనంతరం గర్భగుడిలోని శ్రీవారి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించుకుని వివాహ మొక్కును చెల్లించారు. ఈ సందర్భంగా రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్‌వీర్ దంపతులను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. బనారసి చీరలో సంప్రదాయమైన జువెలరీలో దీపికా పదుకొనే, పసిడి వర్ణంలో వున్న కుర్తాలో రణ్‌వీర్ సింగ్ జోడి ఆకట్టుకుంది.

 

 

Trending News