దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే 19న చివరి విడత ఎన్నికలు పూర్తయ్యే వరకు బయోపిక్ చిత్రాల విడుదలకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ పీఎం నరేంద్ర మోదీ చిత్రం విడుదలను నిలిపేయాల్సిందిగా అందిన ఫిర్యాదుపై స్పందిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కేవలం ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌పై మాత్రమే కాకుండా ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి, కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం వంటి చిత్రాలపై సైతం ప్రభావితం చూపించనుందని తేటతెల్లమైంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెలంగాణలో విడుదల కాగా ఏపీలో ఏప్రిల్ 11 నాటి ఎన్నికల అనంతరం విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా మే 19వ తేదీ వరకు ఆగిపోక తప్పదని స్పష్టమవుతోంది.