బాలీవుడ్ హీరో అకౌంట్ హ్యాక్ చేసిన కత్రినా కైఫ్ ఫ్యాన్స్

కత్రినా కైఫ్ ఫ్యాన్స్‌మని చెప్పుకొనే కొందరు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు

Last Updated : Sep 6, 2018, 05:39 PM IST
బాలీవుడ్ హీరో అకౌంట్ హ్యాక్ చేసిన కత్రినా కైఫ్ ఫ్యాన్స్

కత్రినా కైఫ్ ఫ్యాన్స్‌మని చెప్పుకొనే కొందరు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేశారు. వీరే గతంలో కూడా అభిషేక్ బచ్చన్ ఖాతాను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హ్యాకర్లు టర్క్ దేశస్థులని కూడా వారి పోస్టులను బట్టి అర్థమవుతోంది. వారు షాహిద్ ట్విట్టర్‌ ఖాతాలో అల్లాఉద్దీన్ ఖిల్జీని పొగుడుతూ పోస్టు పెట్టారు. ఈ సంవత్సరం విడుదలైన "పద్మావత్" చిత్రంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో రాజపుత్ర యోధుడు రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. ఖిల్జీ చేతిలో రతన్ సింగ్ ఓడిపోతాడు. అలాగే క్రూరత్వానికి పెట్టింది పేరుగా ఖిల్జీని ఈ చిత్రంలో చూపిస్తారు.

షాహిద్ కపూర్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశాక.. హ్యాకర్లు ఓ పోస్టు పెట్టారు. "రాజా అల్లాఉద్దీన్ ఖిల్జీని మృగమని.. నమ్మకద్రోహి అని సంబోధించవద్దు. సినిమాలో చూపించినట్లు ఆయన అంత క్రూరుడైన వ్యక్తేమీ కాదు" అని హ్యాకర్లు పోస్టు చేశారు. అలాగే "ఐ లవ్ యూ కత్రినా" అని కూడా పోస్టు పెట్టడంతో పాటు.. ఏక్ థా టైగర్ చిత్రంలోని సాంగ్ కూడా పోస్టు చేశారు.

అయితే షాహిద్ కపూర్ అకౌంట్ హ్యాక్ అయిన కొద్ది సేపటికే ఆయన సోషల్ మీడియా టీమ్ తేరుకొని.. దానిని మళ్లీ యధాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నించింది. సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు. గతంలో రామ్ గోపాలవర్మ, క్రితి సనన్ లాంటి వారి ఖాతాలు కూడా హ్యాక్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో షాహిద్ కపూర్ తన సతీమణి మీరా రాజపుత్‌తో పాటు తన కుమార్తె మిషా ఫోటోలు కూడా ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఖాతా సెలబ్రిటీల ఖాతాల్లో మంచి పాపులారిటీని కైవసం చేసుకుంది. 

Trending News