హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇక లేరు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారు. నల్గొండ జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్.. బాల్యం, చదువంతా అక్కడే సాగింది. నాలుగవ తరగతి నుంచే మిమిక్రీ చేయడం మొదలుపెట్టిన ఆయన.. కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలను అనుకరించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలా ఓసారి నేరుగానే ఎన్టీఆర్ కంట్లో పడిన వేణు మాధవ్ జీవితం అక్కడి నుంచి మరో మలుపు తిరిగింది. వేణు మాధవ్‌ని హైదరాబాద్ పిలిపించుకున్న ఎన్టీఆర్.. టీడీపి ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇచ్చారు. అక్కడి నుంచే ఆయన సినిమాల్లో అవకాశం సంపాదించుకున్నారు.
సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వేణు మాధవ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చారు. దాదాపు 600 సినిమాల్లో నటించిన వేణు మాధవ్.. 2006లో వచ్చిన లక్ష్మీ సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. వేణు మాధవ్ ఆకస్మిక మృతి గురించి తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.