ముంబై: 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషి ‘డాక్టర్ బాంబ్’ జలీస్ అన్సారీ కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. పెరోల్‌పై బయటకొచ్చిన అన్సారీ గురువారం ఉదయం నుంచి కనిపించడం లేదట. అగ్రిపడలోని మోమిన్‌పురాలో నివాసం ఉంటున్న 68 ఏళ్ల జలీస్ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి. కోర్టు అతడికి జీవితఖైదు విధించింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్ కేంద్ర కారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న అన్సారీ కొన్ని రోజుల కిందట 21 రోజుల పెరోల్ మీద జైలు నుంచి విడుదలయ్యాడు. పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ముంబైలోని అగ్రిపడ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది. కానీ గురువారం నుంచి అన్సారీ పీఎస్‌కు రావడం లేదు.
తన తండ్రి కనిపించడం లేదంటూ అన్సారీ కుమారుడు జైద్ అన్సారీ పోలీసులను ఆశ్రయించాడు. నమాజ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అన్సారీ తిరిగి ఇంటికి చేరుకోలేదని జైద్ అన్సారీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్ విభాగం అన్సారీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
కాగా, 1993 మార్చి 12న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోగా, దాదాపు 700 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..